వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా వస్తాయో రావోనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడపై మమత మండిపడ్డారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలనే నిర్ణయం మేరకు కాంగ్రెస్ తో సీట్ల పంపకాలకు టీఎంసీ సిద్ధమైందని మమత చెప్పారు. రాష్ట్రంలోని 42 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసినట్లు వివరించారు. అయితే, తమ ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదని, మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీఎంసీ నిర్ణయించిందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు కాదు మొత్తం 42 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చూపించాలని మమతా సవాల్ విసిరారు.
Congress party
శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానని కానీ పార్టీ నాకు చేసిన అవమానం మానసిక వేదనను, భరించలేని బాధను కలిగించిందని రాజయ్య వాపోయారు. ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజికవర్గ అస్తిత్వం మీద దెబ్బపడిందన్నారు. నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నానని ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యాయని రాజయ్య చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని మాట్లాడటం కరెక్ట్ కాదని రాజయ్య హితవు పలికారు.
ప్రభుత్వాలను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదిన గండంగా మారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకుందని, ఫిబ్రవరి 1కి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారని నమ్మకంతో యువత ఓట్లు వేశారన్నారు. కానీ కాంగ్రెస్ వారిని నమ్మించి నట్టేట ముంచిందని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల కోడ్ రాకముందే నిబద్ధతతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగి స్టార్ట్ అయిందని, కాంగ్రెస్ పార్టీ రైతు బంధు హామీ నెరవేర్చలేదని బండి మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం మంచి పథకమేనని, దానిని ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. అయితే ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బండి తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావు. కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంతమంది ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో 2024 ఎన్నికల్లో మేము విజయం సాధించి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ముప్పై సంవత్సరాలకు పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగి విరమణ అనంతరం వృద్దాప్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని అందులో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా భవన్లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం వృధ్యాప్య భద్రత అవసరమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా పెన్షన్ అందజేయాలని కాంగ్రెస్ భావించి ఆ దిశగా కట్టుబడి ఉందన్నారు. అందులో బాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థల మేలుకోసమే సీపీఎస్ విధానం వచ్చిందని ఉద్యోగుల మేలుకోసం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణ తొందరలోనే చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ తో 19 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న రెండు లక్షల ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా పాత పెన్షన్ పునరుద్దరణకు కృషిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్, జిల్లా కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, సందుపట్ల రమేష్, బండారి సతీష్, కొణతం నగేష్, కేశెట్టి నవీన్, అనుమాండ్ల నరేందర్, నాంపల్లి హరికృష్ణ, కొత్త వంశీ, గుండా శ్రావణ్,భక్తుల రమేష్, సిర్ర శ్రీనివాస్, ఏగ్యారపు వెంకటేష్, మహేందర్ అపెక్స్ హాస్పిటల్ యాజమాన్యం రమేష్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా నాగపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ త్వరలో భారత్ న్యాయ్ యాత్ర చేయనున్నారని తెలిపారు. బీజేపీ నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోందని డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ గొంతెత్తడంతో అదానీ ఇంజిన్ ఆగిపోయిందని ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ కూడా ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా వంద రోజుల పాటు దేశం కోసం కాంగ్రెస్ కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని మీ దరఖాస్తులన్నీ తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని దామోదర రాజనర్సింహ అన్నారు.
భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర పేరుతో ‘మణిపూర్ నుంచి ముంబై’ యాత్ర చేపట్టనున్నారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. జోడో యాత్రక కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని వెల్లడించింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.
Read Also..
Read Also..
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభలు చేపడుతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను 5 వందలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది, ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అయితే, రాష్ట్రంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లు సుమారుగా 70 లక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి ‘నేమ్ ఛేంజ్’ ఆప్షన్ ఉండడంతో మిగతా వినియోగదారులు పేరు మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ క్రమంలోనే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.





Total views : 150005