తెలంగాణలో మార్చి మొదటి వారంలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపించనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నుంచి మే నెల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతోంది. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉ:ది. వడగాలుల ప్రభావం వల్ల వడదెబ్బ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భారీ ఎండల నుండి రక్షణ పొందేందుకు ప్రజలు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం అని అంటున్నారు. దప్పిక లేకపోయినా సరే తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేసుకోవడానికి మజ్జిగ లాంటి పానీయాలు తీసుకోవాలి. తరుచూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండటం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. వేసవిలో పుచ్చకాయ, ఖర్బూజ వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో తలకు టోపీ లేదా గొడుగు వాడటం శ్రేయస్కరం అని వైద్యులు సూచిస్తున్నారు. వస్త్రధారణ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.





Total views : 149529