టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని నాశనం చేసినట్లే కాంగ్రెస్‌ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి ఉన్నాడని.. కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ఏ పార్టీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని అన్నారు.
TPCC Revanth Reddy
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…’ అని రేవంత్ పేర్కొన్నారు. నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.
కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని, కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ కు, కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్ వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోంది. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు. బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని, తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు.తెలంగాణాలో కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లాది రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది! అని ట్వీట్ ముగించారు.






Total views : 141255