ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై హెచ్-ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్లు, ఇండస్ట్రియల్ కలర్స్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి హానికర పదార్థాలను నకిలీ మసాలాల తయారీలో వినియోగించినట్లు గుర్తించినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ అధికారుల భారీ ఆపరేషన్.
91