పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఈ సారి గనక మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే.. కచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాక్ వేదికగా శాంతి చర్చలు విఫలం..మళ్లీ ట్రంప్ హెచ్చరికలు..ఇరాన్ దూకుడు తాజాగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యంపోస్తున్నాయి…
ఇరాన్ విషయంలో తమ తదుపరి ప్రణాళికల గురించి.. సోషల్ మీడియాలో పరోక్షంగా ప్రస్తావించిన ట్రంప్… ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే తన దగ్గరున్న ఏకైక అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే అని చెప్పారు. ఇరాన్ నౌకలను కదలనీయకుండా చేసి… ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు అమెరికన్ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వెనెజువెలా విషయంలోనూ ట్రంప్ ఇదే ఫార్ములాను వాడి సక్సెస్ అయ్యారు. అందువల్ల ఇరాన్ మీద కూడా అదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో… ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడే సూచనలున్నాయి. ఇప్పటికే ఆ దేశ వైమానిక దళాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన అమెరికా.. ఈ సారి చమురు కేంద్రాలతో పాటు.. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అటు ఇరాన్ కూడా అంతే గట్టిగా ప్రతిఘటించే పరిస్థితులున్నాయి.
ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చు. అదే జరిగితే.. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ దేశాలన్నీ ఇరాన్ దాడులతో తీవ్రంగా నష్టపోయాయి. ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లిన దేశాలు.. నేడు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నాయి. టూరిస్టులు లేక బోసిపోతున్నాయి. దీంతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది. అలాగే అటు ఇజ్రాయెల్‌తో ఇప్పటికే కయ్యం పెట్టుకున్న లెబనాన్ కు ఇప్పటికే యుద్ధం విస్తరించింది. , సిరియాకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికాస్థావరాలు, చమురు కేంద్రాలపై కూడా మళ్లీ ఇరాన్ దాడులను ముమ్మరంచేసే అవకాశాలున్నాయి..
ఇరాన్‌తో చర్చలు విఫలమైన వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను తెరుస్తామని ఇరాన్ చేసిన వాగ్దానాన్ని విస్మరించిందన్నారు. హర్మూజ్‌ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు చెప్పారు. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్ మొదలుపెడతాయన్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు. సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేస్తామన్నారు. తమపై, శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు.
ఇరాన్ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. అణుశక్తి విషయంలో అంగీకారం కుదరలేదని ట్రంప్ పేర్కొన్నారు. అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు బెడిసికొట్టాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని తేల్చిచెప్పారు.ఇరాన్ నౌకాదళం, వాయుసేన నాశనమైందని.. గగనతల రక్షణ, రాడార్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ సహా అనేక మంది ఇరాన్ నేతలు మరణించారని.. ఇదంతా వారి అణ్వాయుధాల ఆశయం వల్లేనని అన్నారు. హర్మూజ్ దిగ్బంధనం త్వరలో ప్రారంభమవుతుందని, ఇందులో ఇతర దేశాలు కూడా భాగస్వామ్యమవుతాయన్నారు. చట్టవిరుద్ధంగా ఇరాన్ ప్రయోజనం పొందడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ మరింత రెచ్చగొట్టేలా మారాయి..
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. అర్ధంతరంగా చర్చలను ముగించి జేడీ వాన్స్ బృందం వెనక్కి వెళ్లిపోయింది. అనేక గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చర్చలు ముగిసిన అనంతరం వాన్స్ ఇస్లామాబాద్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ… 21 గంటలు నిరంతాయంగా ఇరాన్ తో తాము చర్చలు జరిపామన్నారు. అనేక కీలకమైన విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని స్పష్టం చేశారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతలు విధించామని.. కానీ వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామన్నారు. సద్భావనతో ఇక్కడికి వచ్చి.. ఒక ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు. ఇది అమెరికా కంటే.. ఇరాన్‌కే దురదృష్టకర వార్తగా పేర్కొన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే తాము.. అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు.మరోవైపు అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపై ఇరాన్ స్పందించింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని ఆ దేశ మీడియా పేర్కొంది.
అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలోనూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది. లెబనాన్ టార్గెట్ గా వైమానిక దాడులకు దిగింది. ఈ కారణంగానే ఇరుదేశాల శాంతి చర్చలు విఫలమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్ యురేనియం నిల్వలు కొల్లగొట్టాలనే సంకల్పంతో యుద్ధాన్ని ఎగదోసిన అమెరికా వ్యూహాన్ని..తనకు అనుకూలంగా ఇజ్రాయిల్ మార్చుకోవడంతో ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యుద్ధం నుంచి వైదొలగలేక..కొనసాగించలేక..పాకిస్థాన్ ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు…ట్రంప్ ఇంటా బయటా అభాసుపాలుకాక తప్పలేదు..ప్రపంచాన్ని సైనికంగా శాసించగలిగే సత్తా ఉన్న అమెరికా ఇరాన్ వ్యూహాన్ని నిలువరించడంలో వైఫల్యం చెందిందనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంకా అగ్రరాజ్యమనే దురహంకారం నుంచి ట్రంప్ మాత్రం బయటపడడం లేదు..ఇరాన్ పై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. యుద్ధం మొదలు పెట్టింది అమెరికా అయినా…ముగించేది తామేనంటోంది ఇరాన్. తమ ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిఘటినా యుద్ధాన్ని కొనసాగిస్తోంది…పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి దరిదాపుల్లో లేదని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడి చేసి 300 మందికి పైగా పౌరులను చంపింది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ చర్చలకు 15 రోజుల డెడ్‌లైన్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టింది. ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రాతిపదికన ఈ గడువును విధించింది. 15 రోజుల డెడ్‌లైన్ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22న ముగియనుంది. అప్పట్లోగా అమెరికా – ఇరాన్‌లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది. కానీ.. పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతిచర్చలు విఫలం కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది. దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.





Total views : 81449