Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .

by CVR NEWS

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఐదేళ్ల సడలింపునకు అదనంగా ఈ రెండేళ్లను జత చేసింది. అంటే.. మొత్తంగా యూనిఫాం ఉద్యోగాల అభ్యర్థులకు ఏకంగా 7 ఏళ్ల వయోపరిమితి సడలింపు లభించినట్లయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా జీవో జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులకు రాబోయే నోటిఫికేషన్లలో పోటీ పడేందుకు అవకాశం లభించింది.యూనిఫాం పోస్టుల భర్తీకి సంబంధించి వయోపరిమితిని సడలించాలని ఎంతో కాలంగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. వయోపరిమితి ముగిసిపోవడం వల్ల తాము పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతున్నామని, కాబట్టి వయోపరిమితిని సడలించి తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం.. వయోపరిమితిని సడలించడమే సరైన నిర్ణయమని భావించింది. ఈ ఏడాది మే 18న విడుదల చేసిన జీవో నంబర్ 87 ద్వారా ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితిని పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగుల అభ్యర్థన మేరకు దానికి అదనంగా మరో రెండేళ్లు పెంచుతూ సరికొత్త ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా అడ్-హాక్ రూల్ ప్రకారం.. ఈ వయోపరిమితి సడలింపు అనేది పలు కీలక శాఖల్లో రాబోయే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుంది. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ , ఎక్సైజ్, రవాణా (ట్రాన్స్‌పోర్ట్), అటవీ (ఫారెస్ట్) శాఖల్లోని యూనిఫాం పోస్టులన్నింటికీ ఈ ఏడేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు లభిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ గెజెట్‌లో ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల కాపీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు పంపించారు. రానున్న పోలీస్, ఇతర రిక్రూట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది కొండంత అండగా నిలుస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: