ఉత్తరాఖండ్‌లో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలడంతో లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల కోసం 6 రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులు మరోసారి నిలిచిపోయాయి. పెద్దగా పగుళ్ల శబ్దం వినిపించడంతో రెస్క్యూ పనులు నిలిపివేసినట్టు జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. పనులు చేసే మార్గం బ్లాక్ అయ్యిందని, దీంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేసినట్టు వెల్లడించింది. కాగా గత ఆరు రోజులుగా కార్మికులు సొరంగం లోపల చిక్కుకుపోవడంతో వారి భద్రతపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
national
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటావాలో ఢిల్లీ – దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 21 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. 21 మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. దీపావళి తర్వాత జాతీయ రాజధాని కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోతున్నది. దీంతో ప్రజలు శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులుపడుతున్నారు. చలికాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వంతో పాటు వివిధ ఏజెన్సీలు విఫలమవుతున్నాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం ఉదయం తీవ్రమైన కేటగిరిలోనే నమోదైంది.
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు. గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో అయోధ్య తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలో సిల్క్యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు.
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశానికి ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని 624 ప్రైవేటు బీఈడీ కళాశాలలకుగానూ 253 కళాశాలల అనుమతిని బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. అనుమతిని కోల్పోయిన చాలా బీఈడీ కాలేజీలను ఇప్పటిదాకా నకిలీ గుర్తింపు సర్టిఫికెట్లతోనే నడిపారని తెలిసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇంకొన్ని కాలేజీల అనుమతిని రద్దు చేశారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య 2023-24 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకున్నామని తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 64,905కి పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 19,425 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.33 వద్ద నిలిచింది అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు క్రమంగా పైకి ఎగబాకాయి. చివరిలో ఒక్కసారిగా వచ్చిన కొనుగోళ్లు సూచీలను లాభాల్లోకి గట్టెక్కించాయి.





Total views : 140817