తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు.
గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
revanth reddy live
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి.. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌కు తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్‌కు ఈసీ అందిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.





Total views : 149940