రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఘట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును వారు తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయడం తగదని, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
Telangana
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ జరిపిన తనిఖీల్లో వెంకటరమణకు సంబంధించి సుమారు 27.65 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా 10 అపార్ట్మెంట్లలో 20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. 2 కిలోల బంగారం, 52 లక్షల నగదు, 3 ఖరీదైన కార్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేశారు. ఇక తనిఖీల సమయంలో వెంకటరమణ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన 20 మద్యం బాటిళ్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది. ఆదాయ పరిమితికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన కేసు నమోదు చేసి.. ఆయనపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం… స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, బీఎల్ఓలు, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. ఇదే వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించిన సీఎం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ ఆందోళనలపైకూడా స్పందించారు.
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఓటరు జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో… సీఎం స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేయడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు..
సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బందితో సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే ఎంతవరకు పూర్తయింది… ఎన్ని ఫారాలు సేకరించారు… ఎక్కడైనా సమస్యలు ఎదురవుతున్నాయా… ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది… అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని… అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
సమీక్ష అనంతరం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశాలపై స్పందించారు. నీట్ అంశంపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల విషయంలో కేంద్రం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు.
కొడంగల్ పర్యటన ద్వారా ఒకవైపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు… మరోవైపు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించగా అయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రెండు ప్రధాన పార్టీల కార్యాలయల ముట్టడికి ఇరు పార్టీల నాయకులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదేవిధంగా రాజ్ భవన్ వద్ద కూడా పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టీపీసీసీఅధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు వారి వారి పార్టీ కార్యాలయాల వద్దకు భారీగా చేరుకున్నారు. ముందుగా బీజేపీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో పోలీసులు వారిని అడ్డకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం గాంధీ భవన్ వద్దకు బీజేపీ శ్రేణులు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక్కసారిగా రెండు పార్టీల నాయకులు నాంపల్లి రోడ్ల పైకి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా అయా పార్టీల వ్యతిరేక నినాదాలతో హొరెత్తాయి.
బీజేపీ శ్రేణులు గాంధీభవన్ వైపు చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డకుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేఫథ్యంలోనే ఇరు పార్టీల నాయకుల మద్య తీవ్ర స్థాయిలో తొప్పులాట జరగడంతో పాటు పరస్పర దాడులకు దిగ్గారు. ఇరు పార్టీల నాయకులు ఒక్కరి పై ఒక్కరు కర్రలు, రాళ్ళతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలు కాగా జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. ఈ దాడుల కారణంగా దీంతో నాంపల్లి ప్రధాన రహదారి పై మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకుంది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో చివరకు లాఠీలకు పనిచెప్పారు.
నీట్ పరీక్షల లీక్ తో పాటు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసిసి పిలుపుమేరకు టీపీసీసీ అధ్వర్యంలో చలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చారు. దీంతో లక్డీకాపూల్ నుండి లోక్ భవన్ వరకు టీపీసీసీ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కూడా రాజ్ భవన్ ఎదుట బైటాయించి చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా రాజ్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బారికెడ్లను తోసుకుని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్ సి.వి.రావుకు శుభలేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం బండ్ల గణేష్… చైర్మన్ సీ.వి.రావుకు వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానం పలికారు. మర్యాదపూర్వకంగా సాగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అందులో 14 గుంటల స్థలంలో రాజస్థాన్‌కు చెందిన జైశ్రీరామ్ గిరి అనే స్వామీజీ.. మాతాజీతో కలిసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి అమావాస్య రోజున భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారని పోలీసులు తెలిపారు.అయితే ఆశ్రమం వద్ద గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, తాండూరు రూరల్ పోలీసులు, యాలాల పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఆశ్రమం ముందు పెంచుతున్న సుమారు 36 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవటంతో కొడంగల్ లో SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి BLOకి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్షా చేసి స్థానిక నాయకులు, బిఎల్ఏలతో సమావేశమైయ్యారు. సర్ పక్రయ ఎలా సాగుతుందో తదితర పలు కీలక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సర్ జరుగుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకుప్రయత్నిస్తున్నారన్నారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ . ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారు. వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారన్నారు. కొడంగల్‌లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో 100శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కొడంగల్‌లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ర్యాలీ, ధర్నా చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. కొడంగల్ అంబేద్కర్ సర్కిల్లో సీఎం నిరసన వ్యక్తం చేశారు. సీఎం ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిరసన.
ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ… నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని… నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు సమావేశాల వేళ సభలో చర్చల్లో పాల్గొనకుండా, ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసనల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత పార్లమెంటులో ప్రశ్నలు అడగటం, చర్చలు జరపడమే తప్ప, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించడం కాదని ఆయన హితవు పలికారు. సభలో చర్చకు ఆస్కారం లేకుండా పదేపదే అంతరాయం కలిగిస్తూ, వాయిదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నాటకాలాడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అసోం, పుదుచ్చేరి వంటి అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ను తిరస్కరించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీ ప్రజాసేవ కంటే రాజకీయ అవకాశవాదానికే పెద్దపీట వేస్తుందని, ప్రజలు ఇప్పటికే వారి నిజస్వరూపాన్ని గుర్తించారని ఆయన పేర్కొన్నారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రతీకాత్మకంగా చేతులకు సంకెళ్లు వేసుకోవడంపై ఆయన ఎద్దేవా చేస్తూ, ఆ పార్టీ రాజకీయ ఆకాంక్షలకు భారత ప్రజలు ఎప్పుడో సంకెళ్లు వేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు నిజంగా వాదనలు వినిపించాలనే చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. దేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరమే కానీ, నిరంతరం గందరగోళం సృష్టించే ప్రతిపక్షం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటివని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలను పారదర్శకంగా అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.