మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకత్వంలో ‘మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్’ను ఘనంగా నిర్వహించారు. ఏరియా నర్సరీలో జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకే రోజు 500 మొక్కలను నాటి పచ్చని భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింగరేణి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
Telangana
ఎల్నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు మంత్రి పొంగులేటి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశమున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లాల పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అవసరమైన ఆర్థిక సహాయం, మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణిపై సోషల మీడియాలో వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టొచ్చు.. మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించవచ్చు.. కానీ న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న దేశ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు ఎప్పటికీ అణచివేయలేరని కామెంట్ చేశారు.
ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశ యువత హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారని, వారి పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న యువతకు, వారి ఆకాంక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో విషపూరిత పదార్థం సేవించిన ఉదయ్ కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి… తనపై వచ్చిన ఆరోపణలు, ప్రచారాలన్నీ నిరాధారమని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులే కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో తనకు ఏడాది కాలంగా సంబంధం ఉందని ఉదయ్‌కృష్ణ లేఖలో తెలిపారు. ఆ మహిళకు వివాహమైన తర్వాత కూడా తమ మధ్య బంధం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. సదరు మహిళ తనంతట తానే తన గదికి వచ్చిందని, వాట్సాప్ సందేశాల ద్వారా తలుపు తెరవాలని కోరేదని వెల్లడించారు. ఇటీవల ఈ నెల 9న కూడా తన గదికి వచ్చి బలవంతం చేసిందని లేఖలో రాసుకొచ్చారు.
ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని ఎన్పీఏ నుంచి అధికారులు పంపించేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2027 జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిపుణుల బృందాలు క్షుణ్ణంగా పరీక్షించాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డిజైన్లను నిపుణులు లోతుగా పరిశీలిస్తున్నారని, వారందించే తుది నివేదికలు, సూచనల ఆధారంగా బ్యారేజీలన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఫౌండేషన్ లోపాల వల్లే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని నిపుణులు పేర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేస్తే అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారని పేర్కొన్నారు. ఈ సాంకేతిక కారణాల వల్లే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది. శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్ఐ రఫీపై అవినీతి, రికార్డుల తారుమారు, రైతులను బెదిరించడం వంటి ఆరోపణలు గుప్పించారు. మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి భూముల సర్వే చేయకుండా రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఆర్డీవో, కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ నెల 14న ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఆర్ఐ రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో మరోసారి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పట్టాలు లేని భూములను డబ్బులు తీసుకుని రికార్డుల్లో నమోదు చేస్తున్నారని, అసలు అర్హులైన రైతుల పనులను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
అంతేకాదు… ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు 500 రూపాయలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి దరఖాస్తులకు 5 వేల రూపాయల వరకు, రేషన్ కార్డుకు 1,500, భూముల సర్వేలకు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని, పాస్‌బుక్కులు రద్దు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
సంబంధిత రెవెన్యూ అధికారులు ,, ఆర్ఐ రఫీ నుంచి దీనిపై అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఫిర్యాదులపై విచారణ అనంతరం వాస్తవాలు తేలాల్సి ఉంది. రైతులు మాత్రం రఫీని తక్కెళ్లపహాడ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలోని వివాదాస్పద భూములకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ, అక్కడి రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బహదూర్‌గూడలోని సర్వే నెంబర్లు 3, 4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత 30 ఏళ్లుగా ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం, సదరు భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ముందస్తు ఆదేశాలతో పిటిషన్ దాఖలు చేసిన నలుగురు రైతులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.
హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని’ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ కలిసి సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్కో టవర్‌లో 10 అంతస్తులు.. ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ నిర్మించిన నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెంచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ అన్ని రకాల పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆయిల్ పామ్ మంచి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని’ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మరియు నేత అజారుద్దీన్ కలిసి సచివాలయంలో ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్కో టవర్‌లో 10 అంతస్తులు.. ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో మొత్తంగా లక్ష ఫ్లాట్లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఇందుకోసం చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించారు.పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఇది సాకారం అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా స్థలం ఉన్న వారికి 4.50 లక్షల ఇండ్లు ఇచ్చాం. ఆగస్టు నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం వెలుపల 30 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కట్టడం వల్ల ఉపాధి లేక పేదలు అక్కడ ఉండలేకపోయారు. కానీ మేము క్యూర్ పరిధిలోనే, గజం రూ. 2 నుంచి 3 లక్షల విలువైన ప్రాంతాల్లో కూడా స్థలాలు సేకరించి ఇండ్లు కట్టిస్తున్నాం.
చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు అందేలా చూస్తామని, పేదలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ గృహాలను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన పేదలందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్లు వరంలా మారబోతున్నాయి.