Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.

by CVR NEWS

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధరణి, నీటిపారుదల ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్, డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీల ఆదాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

ఈ సమావేశంలో దేవాదుల, చిన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే జగిత్యాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపునకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పునూ మంత్రివర్గం ఆమోదించింది.

తెలంగాణ పంచాయతీ రాజ్-2018 చట్ట సవరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలో కాకుండా ఇకపై నేరుగా జీపీ బ్యాంకు ఖాతాలోనే జమయ్యేలా 70(3) సెక్షన్ సవరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ధరణి పోర్టల్‌ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ధరణి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని తీర్మానించింది.

మరోవైపు, మంత్రిమండలి నిర్ణయంతో సిట్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సిట్ ద్వారా భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యుటేషన్లపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ధరణి ద్వారా జరిగిన భూ వివాదాలన్నింటిపైనా వివరాల సేకరణకు కసరత్తు చేస్తోంది. అక్రమంగా లబ్ధి పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, సంబంధిత పత్రాల పరిశీలనను ప్రారంభించాలని తీర్మానించింది. సిట్ ద్వారా ధరణి అక్రమాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: