ఆడుదాం – ఆంధ్ర ఆటలో భాగంగా అంతరాష్ట్ర రహదారి మార్గంలో వినూత్న రీతిలో నిరసన చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఆడుదాం – ఆంధ్ర అనే ఆటలో భాగంగా మండల కేంద్రానికి అతి సమీపంలో అంతరాష్ట్ర రహదారి మార్గంలో ఉన్న గోతులు వద్ద వినూత్న రీతిలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆడుతూ ఆ గోతుల్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిలి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు మరడాన రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
Vijayanagaram
మార్పు తీసుకొస్తాం వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. యువగళం పాదయాత్ర జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర అని అన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చన్నారు. తనకు రాని అవకాశాన్ని లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందంటూ పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకమన్న పవన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేనన్నారు. భారతదేశానికే స్ఫూర్తినిచ్చిన నేల అని ఐఏఎస్లు, ఐపీఎస్లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లన్నారు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారు. కానీ, ఇప్పుడు.. ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందన్న పవన్ ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదని సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చాన్నారు.
ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది.. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల జనాభా వస్తారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ లో యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ రెస్టారంట్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. అనసూయ ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ విజయవాడ భోజన ప్రియుల రుచులకు అనుగుణంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ లో అన్ని రకాల వెరైటీ లు లభిస్తాయని, రెస్టారెంట్ విజయవంతం కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు.
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ చౌక్ లో ధర్నా నిర్వహించారు.శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి. ప్రతి నెల 5 వ తేదిలోపు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ పరికరాలు (గౌజులు, మాస్క్ లు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి. శానిటేషన్ కార్మికులందరినీ 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బాత్రూంలను ఫోటోతీసి యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి.
టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. జనవరి 27వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది. ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్పై వచ్చిన తరువాత నవంబర్ 27 నుంచి తిరిగి ప్రారంభించారు. సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు. మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు. అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్ హామీ ఇచ్చారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. భారీ స్థాయిలో ముగింపు సభ, యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేది విజయోత్సవ సభను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
విజయనగరం జిల్లా, శృంగవరపుకోట, కిల్తంపాలెంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. శృంగవరపుకోట మండలం, కిల్తంపాలెం పంచాయతీ దెప్పురు & కరక వంజురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు. త్వరగా కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. గడిచిన గత నాలుగు రోజులుగా ఏజెన్సీ ఉష్ణోగ్రతలు కనిష్టంగా 10 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ఘాట్ రోడ్లు పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ పిల్లి మృతి చెందింది. ఈ పిల్లిని ఫిషింగ్ క్యాట్ (బవురు పిల్లి) అంటారని ఇది అంతరించిపోతున్న అరుదైన జాతి అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఈ పిల్లిని స్వాదీనం చేసుకున్నారు. ఈ పిల్లి చూడటానికి నల్ల మచ్చలతో చిరుత పులి పిల్లలా కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఇది రాత్రి పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఇది చేపలను, కప్పలను, పాములను, పక్షులను, కోళ్లను ఆహారంగా తీసుకుంటుంది.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.