Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh రాజాంలో మద్యం సిండికేట్ల బహిరంగ దందా…

రాజాంలో మద్యం సిండికేట్ల బహిరంగ దందా…

by CVR NEWS
SKLM MADYAM MAFIA

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో మద్యం సిండికేట్ల దందా బహిరంగంగా నడుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తుంగలో తొక్కుతూ ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ‘సివిఆర్ న్యూస్’ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఈ అక్రమ వసూళ్లు స్పష్టంగా బయటపడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వినియోగదారులు ఎంఆర్‌పి ధరకు మద్యం అడిగితే ‘పైనుంచి ఆదేశాలు ఉన్నాయి’ అంటూ షాపు సిబ్బంది బహిరంగంగా చెబుతున్న దృశ్యాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తున్నాయి. కొందరు ప్రభుత్వం ధరలు పెంచిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండగా, మరికొందరు సిండికేట్ పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నారు. ఇది కేవలం చిన్న మొత్తమే అయినప్పటికీ రోజుకు వేల బాటిళ్లు అమ్ముడవుతున్న నేపథ్యంలో భారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది.
రాజాం పట్టణంలో మద్యం విక్రయాలపై నియంత్రణ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొహిబిషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఎటువంటి రేట్ ఉల్లంఘనలు లేవని చెప్పడం మరింత వివాదాస్పదంగా మారింది. కేవలం బీర్లపై మాత్రమే అదనపు వసూళ్లు ఉండొచ్చని చెప్పడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బెల్ట్ షాపులు నిర్భందం లేకుండా పనిచేస్తుండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. అధికారుల కళ్లముందే అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ‘మామూల్’ వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దెబ్బతినడంతో పాటు వినియోగదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. బాధ్యత గల శాఖల వైఫల్యం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రాజాంలో జరుగుతున్న ఈ మద్యం దందా రాజకీయంగా కూడా ప్రభావం చూపుతోంది. స్థానిక నాయకులు ఈ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్వార్థపరుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని, ముఖ్యంగా పాలకపక్షానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు కూడా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పది రూపాయల అదనపు వసూళ్లు చిన్న విషయం కాదని, ఇది పెద్ద స్థాయి సిండికేట్ కార్యకలాపాల సూచన అని స్థానికులు అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మరియు సంబంధిత శాఖ మంత్రి జోక్యం చేసుకుని పరిస్థితిని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: