జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హాయంలో నిర్మించి.. ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. నూతన ఆసుపత్రిని ప్రారంభించి సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంపై సంబంధిత శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కిటికీలను ధ్వంసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మంత్రి దృష్టికి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి సంబంధిత శాఖ అధికారులను పిలిపించుకుని వంద పడకల ఆసుపత్రి లో కలియతిరిగారు.. ఆసుపత్రి భవన నిర్మాణ నాణ్యత ప్రమాణాల విషయం పై చీఫ్ ఇంజనీర్ ను అడిగారు.. ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సూపర్డెంట్ వంద పడకల ఆసుపత్రి విషయంపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుందని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Damodara Rajanarsimha
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రజాపాలన, అభయహస్తం దరఖాస్తులను స్వికరించిన దామోదర రాజనర్సింహ ప్రజల వద్దకు ప్రభుత్వం రావడమే ప్రజాపాలన అని గుర్తు చేశారు. రాయికోడ్ లో 10 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను అధికారులు తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకుల వైఖరి పై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో అధికారంలో ఉన్నాం కదా అని రాయికోడ్ లో కొందరు వక్స్ భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేశారన్నారు. చివరకు ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసారని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాయికోడ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రధాన రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ శరత్, ఆర్డీవో, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రిని శాలువాతో సన్మానించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మాటిచ్చి ఇచ్చిన మాట నియాబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల ముందుకు వచ్చిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించడం ప్రజల తీర్పుకు కట్టుబడి ఆరు గ్యారెంటీ లను అమలు చేశామన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని మీ దరఖాస్తులన్నీ తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని దామోదర రాజనర్సింహ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, వంశీచందర్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డిలు పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో పార్టీ ఓటమిపై చర్చ, ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో పార్టీ వ్యూహం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also..
Read Also..
ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది.





Total views : 141175