కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. 100 రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తిచేయాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక.. దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సిటింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా, ప్రస్తుత న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొంది.
Kaleshwaram lift scheme
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ అక్టోబరులో కుంగింది. ఈ బ్లాకులో పియర్స్ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు. ఏబీ పాండ్యా ఛైర్మన్గా ఉన్నరాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే, బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) మురళీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ.. బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.





Total views : 152368