దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బోండా ఉమా, తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పెట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ.. రాష్ర్టంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పదో తారీఖు లోపు ఢిల్లీ నుండి ఒక టీమ్ రాబోతుందన్నారు. 8 మంది జిల్లా కలెక్టర్లపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కలెక్టర్లు జగన్ కనుసన్నల్లో కాకుండా.. ఎన్నికల నిభందనలను పాటించాలని తెలిపారు.
Achchennaidu
ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. అర్హతలేని వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఏపీ టీడీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. ఏపీలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఈసీకి వివరించారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని, తప్పుడు ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం జగన్ అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మద్యం అమ్మకాలు, నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలో మద్యంపై కేవలం 50 వేల కోట్లు ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధరలు పెంచడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయని చెప్పారు కానీ ఎక్కడ తగ్గలేదు. మద్యనిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఊరూవాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.




Total views : 151594