ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ , కెప్టెన్ బట్లర్ , హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివమ్ దూబే దూకుడుగా ఆడగా, చివర్లో తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా, జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా…. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది.
World Cup
గతేడాది భారత్ గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీమిండియా… ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లోనూ అదే ఫలితం ఎదురైంది. బెనోనీలో జరిగిన ఫైనల్లో భారత్ కుర్రాళ్ల జట్టు 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. లక్ష్యం పెద్దదేమీ కానప్పటికీ, కుర్రాళ్లు ఒత్తిడికి లోనై వికెట్లు అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్ 47, హైదరాబాద్ ఆటగాడు మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. టోర్నీలో పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) కీలకమైన ఫైనల్లో విఫలం కావడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా, హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరవెల్లి అవనీశ్ రావు (0) డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చాంపియన్స్, టెస్ట్ చాంపియన్ షిప్ విజేత, మహిళల వన్డే, మహిళల టీ20 వరల్డ్ కప్ ల విజేతగా ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా చేరింది. Read Also..
రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1 లక్షా 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసిన ఈ ఆల్ రౌండర్ విజయాన్ని అందుకున్నాడు. తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కి 45వేల 993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ అల్ హసన్ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు.
భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకెళ్లింది. అలా ఇలా కాదు టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఆ తర్వాత వరుస విజయాలు సాధించి, ఆఫ్ఘన్ వంటి జట్టుపై అద్భుత రీతిలో పోరాడి, సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఆసీస్ జట్టు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు. ఆసీస్ విజయంలో బౌలర్లు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్లు స్టార్క్, హేజెల్ వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులకు ఆలౌట్ చేయగా 241 పరుగుల లక్ష్యఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీతో అదరగొట్టాడు. హెడ్ కు లబుషేన్ తోడవడంతో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా విఫలయత్నాలు చేసింది. కానీ కొరకరానికొయ్యల్లా మారిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఆతిథ్య జట్టుకు విజయాన్ని దూరం చేశారు. హెడ్ 137 పరుగులు చేయగా, లబుషేన్ 58 పరుగులతోనూ అజేయంగా నిలిచారు. హెడ్ 120 బంతులాడి 15 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, షమీ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి టీమిండియా నేడు ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావిస్తే ఆస్ట్రేలియా జట్టు తాను అంచనాలకు అందే జట్టును కాదంటూ వరల్డ్ కప్-2023 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గతంలో 1987, 1999, 2003, 2015లోనూ వన్డే వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గింది.
ఇండియా -ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్ అభిమాని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాలు మేరకు….తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ (35) క్రికెట్ అభిమాని.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. ఈరోజు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తూ ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందారు.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడి స్క్రీన్ లో తిలకిస్తున్న యువత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను 3 వేల మంది యువత తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఇండియా క్రికెట్ టీం,ఆస్ట్రేలియా క్రికెట్ టీం తో తలపడుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించి కేరింతలు కొడుతున్నారు. ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు క్రికెట్ వీరాభిమాని బిక్కిన సునయన ఇండియా గెలుపొందాలని కోరుకుంటూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బిగ్ స్క్రీన్ వద్ద హల్చల్ చేశారు ఇండియా గెలిసి వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




Total views : 70905