ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కూడా ఆయనకు లేదన్నారు.2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతిగా 3 వేల 016 రూపాయల ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిందని, ఆ హామీ ఏమైందని మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. మరోసారి నిరుద్యోగులను, యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.గత రెండున్నరేళ్లలో 79 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేసీఆర్, కేటీఆర్‌కు కూడా లేదని మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు.
Telangana
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని, జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఎదుల–దిండి కాలువల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనిని పరిశీలించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 2 టీఎంసీల నీటిని తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. అదేవిధంగా, శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ మరియు పాలమూరు–రంగారెడ్డి ప్రాంతాలకు తగిన విధంగా నీటి కేటాయింపులు కల్పించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరొక వినతిపత్రాన్ని సమర్పించారు. ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
క్యాష్‌లెస్ ట్రీట్మెంట్తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్‌ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు కొత్త హెల్త్ కార్డులు అందజేశారు. ఈ పథకంలో ఉద్యోగుల నుంచి ప్రతి నెలా మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. వైద్య చికిత్సలకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రేట్లను వర్తింపజేస్తారు.
నగదు రహిత చికిత్స పథకాన్ని అందించాలని ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని..పదేళ్లు అధికారంలో ఉన్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని చెప్పారు. 9.5లక్షల మంది ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త EHS పోర్టల్‌ను తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామని గుర్తు చేశారు. 1.06 కోట్ల మంది పేదలకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టిందని భట్టి విమర్శించారు.
మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు మంత్రి దామోదర. కొత్త EHS కార్డుల ద్వారా ఆసుపత్రుల్లో పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత చికిత్సలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 886 నెట్వర్క్ ఆసుపత్రులను అనుసంధానం చేశామని చెప్పారు. దాదాపు 1వెయ్యి816 రకాల వైద్య చికిత్సలు, ఆపరేషన్లను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 వెల్నెస్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర స్పష్టం చేశారు.
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధరణి, నీటిపారుదల ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్, డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీల ఆదాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ఈ సమావేశంలో దేవాదుల, చిన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే జగిత్యాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపునకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పునూ మంత్రివర్గం ఆమోదించింది.
తెలంగాణ పంచాయతీ రాజ్-2018 చట్ట సవరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలో కాకుండా ఇకపై నేరుగా జీపీ బ్యాంకు ఖాతాలోనే జమయ్యేలా 70(3) సెక్షన్ సవరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ధరణి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని తీర్మానించింది.
మరోవైపు, మంత్రిమండలి నిర్ణయంతో సిట్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సిట్ ద్వారా భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యుటేషన్లపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ధరణి ద్వారా జరిగిన భూ వివాదాలన్నింటిపైనా వివరాల సేకరణకు కసరత్తు చేస్తోంది. అక్రమంగా లబ్ధి పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, సంబంధిత పత్రాల పరిశీలనను ప్రారంభించాలని తీర్మానించింది. సిట్ ద్వారా ధరణి అక్రమాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు మరో ముందడుగు పడింది. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 299 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 95 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలు–తండాలు అనే తేడా లేకుండా అర్హులందరికీ దశలవారీగా పక్కా ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరగా… నాచారం దేవాలయం వద్ద ప్రమాణానికి వెళ్తున్న మహిపాల్ రెడ్డి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో తడి బట్టలతో నాచారం దేవాలయానికి వెళ్లి నర్సారెడ్డి అవినీతిని బయటపెడతానంటూ సవాల్ విసిరారు మహిపాల్ రెడ్డి… అంతేకాదు..భారీ బైక్ ర్యాలీతో నాచారం బయలుదేరారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని… నర్సారెడ్డి అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తన వద్ద ఉందని మహిపాల్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజల ముందుంచుతానన్న ఆయన..తాను ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానన్నారు. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి..నర్సారెడ్డి అవినీతిని ఎండగడుతానని బహిరంగంగా సవాల్ చేయడంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి… కొంతకాలంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం తాజాగా మహిపాల్ రెడ్డి సవాల్ తో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే..ఈ వివాదంపై నర్సారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందనేది స్థానిక నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో రంగనాథ్ పాల్గొని చెరువు అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ చెరువులను పునరుద్ధరించడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరిగి, ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసిన కూకట్పల్లి నల్లచెరువు చుట్టుపక్కల గతంలో వెయ్యి ఫీట్లు బోర్లు వేస్తే నీళ్లు పడే పరిస్థితి ఉండేది అన్నారు. కానీ, ఇప్పుడు 100-150 ఫీట్లలోనే నీరు వస్తుందన్నారు. హెచ్ఎంటీ చెరువును రానున్న 10, 12 నెలల కాలంలో పూర్తిగా సుందరీకరిస్తామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత… తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
మొత్తంగా సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, సాగునీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి, పెండింగ్ పనులను పూర్తి చేసి ….రైతులకు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, మూసీ ప్రక్షాళన ఫేజ్-1 పనులు, మెట్రో విస్తరణతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు,కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మడి హట్టి పథకం, కాళేశ్వరం పంపుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలినినో తో నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితులను సమీక్షించి, కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన రెండు నకిలీ జెమిని చాయ్ పత్తి బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ టీ పొడిని పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సరుకును సరఫరా చేస్తున్న సదరు మహేశ్వర ట్రేడర్స్ షాపు యజమానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ ఇలాంటి ఆహార కల్తీకి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో చలామణి అవుతున్న నకిలీ వస్తువుల పట్ల వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.