తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, మరియు భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో అత్యధికంగా 44% తెలంగాణలోనే నమోదయ్యాయి. ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి సైబర్ నేరంగానే ఉండడంతో పోలీసులకు దిశానిర్దేశం చేసి తగు సూచనలిచ్చారు. 2025లో సైబర్ మోసాల వల్ల 1,524 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20% తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన నిధులు 255 కోట్ల నుంచి 279 కోట్లకు పెరిగాయి. బ్యూరో పరిధిలోని AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్, సైబర్ ల్యాబ్, ఎస్ఒసి , డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల పనితీరును డీజీపీ ప్రశంసించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరుగుతున్నాయని, వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టెక్నాలజీ, డాటా అనలిటిక్స్‌ను ఉపయోగించి సైబర్ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలపాలని దిశానిర్దేశం చేశారు
Telangana
తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని ఒక స్థలానికి సంబంధించి హైకోర్టు గతంలోనే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను పక్కనబెట్టి, సదరు స్థలం పార్కుకు చెందిందంటూ హైడ్రా అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేసి బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా ఏకపక్ష చర్యలను సవాలు చేస్తూ బాధితులు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వ విభాగాలు ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం కౌన్సిలర్లపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్యేగా ఎందుకు హాజరు కావడం లేదని, క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు.సిరిసిల్లలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని… భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు కేటీఆర్ అండగా ఉండకూడదని, వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్పందించి ఆయనతో రాజీనామా చేయించాలని కోరారు. లేనిపక్షంలో కేటీఆర్ స్పందించే వరకు, అవసరమైతే ఆయన రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా “కల్మా, సూరహ్ ఫతే” చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇది హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తే ఇటువంటి ఘటనలు తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ఈ అంశంపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఆటో డ్రైవర్ భరత్ వ్యవహారంపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, హిందువులను కించపరిచేలా ఉర్దూలో రాసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు.రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్, హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటామని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా షురూ కానున్నాయి. చరిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఇవాళ లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు. బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల నుండి కోటపై తొట్టెల సమర్పణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్, నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు. నిఖిత కి పెళ్లి ఇష్టం లేకపోవడం తో ఇటీవల విడాకులు తీసుకుంది. అయితే తన కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కరే కారణమని కక్ష పెంచుకున్నాడు నికిత తండ్రి. హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్ లో ఉంటున్న భాస్కర్ ను నికిత తండ్రి, మరికొందరుకలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు. భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు, దళిత సంఘాల నాయకులు ఉప్పరపల్లి లో రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు, పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, పాలు తయారీలో ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు, మిక్సింగ్ సామగ్రి, ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఎంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది? అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ పాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉండటంతో, ఈ ఘటనపై అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్ర, సరఫరా నెట్‌వర్క్‌పై సమగ్ర సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఆహార పదార్థాల్లో కల్తీపై అధికారులు మరింత కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ నెల 18న సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు పెద్దపీట వేయగా… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన గూడెం మహిపాల్ రెడ్డి… యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్ట్ 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది. సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో సర్ షెడ్యూల్‌ను సీఈసీ సవరించింది. బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వేలో భాగంగా నకిలీ ఓట్లు తొలగింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి సవరణలు చేపడతారు. సవరించిన గడువులను కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాలు రూపొందించి, వాటిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అమెజాన్ డేటా సెంటర్ తొలి మైలురాయిగా నిలుస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.