తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం.. మహిళల సాధికారత, పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను వివరించారు. నాచారంలో ప్రారంభమైన బాలామృతం ప్లాంట్ భవిష్యత్తులో తెలంగాణ అవసరాలను తీర్చడమే కాకుండా మరో నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలకు కూడా పోషకాహార ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆలోచనలే పునాది అని పేర్కొంటూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆధునిక పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు.
Telangana
సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇళ్లు ఖాళీగా ఉంచే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే, డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగర కేంద్రంగా సుబ్రమణ్యం అనే వ్యక్తి ఎలాంటి సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్లు లేకుండా అగాపే హోలిస్టిక్ క్లినిక్ పేరుతో పెద్ద ఎత్తున వైద్య సేవలు నిర్వహిస్తున్నాడు. కైరోప్రాక్టిక్, ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, స్పైన్ థెరపీ, హోలిస్టిక్ మెడిసిన్ అంటూ రకరకాల పేర్లతో హైటెక్ వైద్యం ముసుగులో అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేసి ఈ నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించడం చూస్తుంటే ఇతని వెనుక ఉన్న శక్తులెవరో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక క్లినిక్ నడపాలంటే సంబంధిత వైద్య మండళ్లు, ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఈ క్లినిక్‌కు ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్లు లేవని సమాచారం. పేరుకు ముందు డాక్టర్ అని వేసుకోకపోయినా.. లోపల మాత్రం రోగులకు హై-లెవల్ ట్రీట్మెంట్లు ఇస్తూ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. సరైన డిగ్రీ, కనీస అర్హత లేకుండా స్పైన్ థెరపీ లాంటి సున్నితమైన వైద్యం చేయడం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఇంతపెద్ద దందా సాగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటివరకు ఈ క్లినిక్‌పై ఎలాంటి విచారణ జరపకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమాయక రోగుల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఈ అగాపే హోలిస్టిక్ క్లినిక్‌పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల విచారణ అనంతరమే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సొంతింటి కలతో ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పదేళ్ల క్రితం నిర్మించిన 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. సర్వేలు, విచారణలు కొనసాగుతున్నా… పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో 2015-16లో హుజూరాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్‌లో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇళ్లు పూర్తయినా… ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ కేటాయింపు జరగకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
2021 హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన వార్డు సభల్లో మరోసారి దరఖాస్తులు స్వీకరించగా… 2,450 మందికి పైగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 450 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో… అర్హత లేని వారికి కూడా ఇళ్లు కేటాయించారనే ఫిర్యాదులు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించారు.
విచారణ ప్రారంభమై నెల రోజులు దాటినా… ఇళ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కేటాయింపులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా… ఇన్నాళ్లు ఖాళీగా ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. పలుచోట్ల కిటికీలు, తలుపులు, విద్యుత్ మీటర్లు చోరీకి గురయ్యాయి. డ్రైనేజీ, తాగునీటి వంటి కనీస మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.
పదేళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని… ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇళ్లకు మరమ్మతులు చేసి, మౌలిక వసతులు కల్పించి అర్హులకు కేటాయించాలని కోరుతున్నారు. నిర్మాణం పూర్తై దశాబ్దం గడిచినా… డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందకపోవడం హుజూరాబాద్‌లో చర్చనీయాంశమైంది. విచారణను త్వరగా పూర్తి చేసి… ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లకు స్మార్ట్ఫోన్ల కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మొత్తం 70 మంది కార్పొరేటర్ల కోసం రూ.23 లక్షల 43 వేల బడ్జెట్‌ను కేటాయిస్తూ కార్పొరేషన్ తీర్మానం చేసింది. శామ్సంగ్ గెలాక్సీ A37 సిరీస్ 5G స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు టెండర్ నోటీసు జారీ చేయగా, ఒక్కో ఫోన్ బేసిక్ ధరను రూ.33,474గా అధికారులు నిర్ణయించారు. ఫోన్లతో పాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ పౌచ్, ఛార్జర్లను కూడా మున్సిపల్ నిధులతోనే కొనుగోలు చేయనున్నారు. 8GB ర్యామ్, 256GB మెమొరీ, ట్రిపుల్ కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను ప్రజాధనంతో కొనుగోలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండర్ల దాఖలుకు జూలై 7 సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించినట్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అరికట్టాలని, పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద పెండింగ్‌లో ఉన్న 11 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ABVP నేతలు, జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్‌ల వరకు విద్యార్థులందరూ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు దిగుతామని ABVP నేతలు హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు.ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానbని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలు తమ ఇళ్లు, కాలనీలు, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీ సురక్ష – నేను సైతం 2.0″ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3 వేల సీసీటీవీ కెమెరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో మొత్తం 2 లక్షల 45 వేల 35 సీసీటీవీ కెమెరాలు ఉండగా, ఈ ఏడాదిలోనే మరో 16 వేల 339 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో ఈ ఏడాది 214 కేసులను ఛేదించగలిగామని సీపీ తెలిపారు. అలాగే లండన్ తరహాలో డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించామని, త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపడతామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు.
గ్రీన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తూ దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత సమన్వయంతో సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు నుంచి పారిశ్రామిక రంగంలో సామర్థ్యాల విస్తరణ వరకు ప్రతి విభాగంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామిక ప్రగతికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
తారామతి, బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో పాల్గొన్నారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని… యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీశాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులు తీర్చి దిద్దాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని… అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జీలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని… అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పైన కసరత్తు ప్రారంభించాలని సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయానికి కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.