Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Devotional గాయత్రీ దేవి శక్తిస్వరూపిణి భ్రామరీగా ఎలా పిలవబడింది

గాయత్రీ దేవి శక్తిస్వరూపిణి భ్రామరీగా ఎలా పిలవబడింది

by Satya
Gayatri Devi

పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి లోకాలు భరించనలవిగాని   అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అతడి తపస్సు ను ఆపించమని కోరారు. బ్రహ్మదేవుడు వెంటనే అరుణుడికి ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. అప్పటికే అలాంటి కొన్ని వరాలిచ్చిన అనుభవం.. వాటి పర్యావసానాల అనుభవం వుండటం వల్ల ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. ‘మరేదైనా వరం కోరుకో’ అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు “చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని, శస్త్రాస్త్రాల వల్ల కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరి వల్ల కాని, రెండు కాళ్ళు గల ప్రాణి వల్ల గాని, నాలుగు కాళ్ళ జంతువు వల్లగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరాన్ని”ఇమ్మని కోరాడు. బ్రహ్మ “తథాస్తు” అన్నాడు. బ్రహ్మ వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకం పై దండయాత్రకు సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూతను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు. బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనతో పరాశక్తిని వేడుకున్నారు. ఆమె మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన సమర్ధుడు దేవగురువైన బృహస్పతి అని వారికి తెలియచేసింది. ఇది దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. అలా తనకోసం వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,” మునీవర్య నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నా శత్రువులు. అందువల్ల   నాతో మీకేమి పని ? మీరాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, “రాక్షస రాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవం గాయత్రీ దేవిని నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, అలా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు “అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురహంకారము, అవివేకము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.  గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా రాక్షసరాజు అరుణుడు తేజో హీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో దేవతలు బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది. దేవతల మొర విని దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. వెంటనే పరాశక్తి తన మాయా విలాసంచేత కోట్లాదిగా తుమ్మెదలను సృష్ఠించి ఆ భ్రమరాలను ప్రేరేపించింది. అవి చెలరేగి ,భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా కట్టడి చేశాయి. దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుడిని, అతని రాక్షస సైనికులను యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పదుల వల్ల అంటే ఆఱు పాదాలు గలది తుమ్మెదల వల్ల మరణించాడు. తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు. మహాశక్తిని నాటినుండి భ్రామరిగా జగత్తు అంతా కొనియాడుతుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026852
Total views : 151244

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.