Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

by CVR NEWS
అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని వైద్యం ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలోని ముఖ్య పట్ఠణాలు , మండల కేంద్రాలలో ప్రతి వీధిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పుట్టుకొచ్చారు . కొంత మంది కనీస విద్యార్హత లేకుండా, ఆర్.ఎం.పి డాక్టర్ సర్టిఫికెట్ కూడా లేకున్నా క్లినిక్లను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఇష్టానుసారంగా రోగులకు స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్ లు , ఇతర ప్రమాదకర మెడిసిన్ అందిస్తూ ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు. కేవలం ప్రథమ చికిత్స చేసి వైద్యుని దగ్గరికి పంపాల్సిన ఆర్ఎంపీలు వీళ్లే వైద్యునిగా భావించి వారికి చిన్న చిన్న శస్త్ర చికిత్సలు సైతం చేసేస్తున్నారు. తొందరగా రోగం నయం అయ్యే విధంగా పరిమితికి మించి స్టెరాయిడ్స్,యాంటిబయాటిక్స్ అందిస్తూ సత్వర ఫలితం వచ్చే విధంగా చేస్తున్నారు. దాంతో అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్ఎంపీలు ఇచ్చే స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ కు అలవాటు పడి వారి వద్దకే ప్రతి వ్యాధికి చికిత్స కోసం ఎగబడుతున్నారు

అనంతపురం జిల్లా కేంద్రంలో ఆరోగ్య సేవల పేరుతో ప్రమాదకర పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రథమ చికిత్స కేంద్రాలు వేగంగా పెరుగుతుండగా, వాటిలో చాలా వరకు కనీస అర్హతలు లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టెతస్కోప్ పట్టుకుని వైద్యుల్లా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీలు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చిన్న జబ్బుల నుంచి మైనర్ సర్జరీల వరకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం ఉండటం మరింత భయానకంగా మారింది. తక్కువ ఖర్చుతో త్వరగా చికిత్స అందిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షిస్తున్నప్పటికీ, అందుతున్న సేవల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనధికారిక మందులు తీసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ, అధికారుల నుంచి గట్టి చర్యలు కనిపించడం లేదు. హోమియోపతి చదివిన కొంతమంది అల్లోపతి వైద్యం చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికైనా అనధికారిక క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆర్ఎంపీ డాక్టర్ అంటే తమ వద్దకు వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స చేసి వేరే ఆసుపత్రికి రిఫర్ చేయాలి . కానీ హిందూపూర్ లో మాత్రం ప్రథమ చికిత్స పరిధిని దాటి ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నారు . వారి దగ్గరికి వెళ్లిన వారందరికీ సెలైన్ ఎక్కించడం, ఇంజక్షన్ వేయడంతో పాటు పెద్ద పెద్ద చికిత్సలు చేస్తున్నారు . లేడీ ఆర్ఎంపి డాక్టర్ అయితే గర్భిణీలకు కాన్పులు కూడా చేసేస్తున్నారు. చిన్నపిల్లల విషయానికొస్తే ఎంబిబిఎస్ , పీజీ చేసిన డాక్టర్లు కూడా చేయని వైద్యం ఆర్ఎంపీలు చేసేస్తున్నారు. చిన్నారులకు స్టెరాయిడ్స్ , యాంటీబయోటిక్స్ సెలైన్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. చిన్నపిల్లల ప్రాణాలు అతి సున్నితమైనవి అయినా కూడా వారు ఏమాత్రం భయపడకుండా ప్రమాదకరమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఇటువంటి ఆర్ఎంపి క్లినిక్లు మినీ నర్సింగ్ హోమ్ గా చెలామణి ఆవుతున్నాయి. ఆర్ఎంపీల వద్దకు వచ్చే రోగుల సంఖ్యను బట్టి వారికి అసిస్టెంట్లుగా నర్సులను కూడా ఏర్పాటు చేసుకున్న వైనం హిందూపూర్ లో చోటుచేసుకుంది . ఆర్ఎంపీ క్లినిక్ లో బెడ్లు ఏర్పాటు చేయడం ఒకటి రెండు రోజులు అక్కడే రోగులను ఉంచుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఆర్ఎంపీ క్లినిక్లు హిందూపురం నియోజకవర్గంలో 245 ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీ క్లినిక్లలో ప్రమాదకరమైన వైద్యం జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ స్వయంగా ఆర్ఎంపీ క్లినిక్ లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ తనిఖీల్లో సైతం నెవ్వరపోయే విషయాలు బయటకు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపి క్లినిక్లను ఆయన స్వయంగా తనిఖీలు చేసి సీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యం పట్ల ఎవరు అక్రమాలకు పాల్పడినా కఠినంగా శిక్షలు ఉంటాయని, ఆర్ఎంపీలు హద్దులు దాటి వైద్యం అందించకూడదని జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.

మరో వైపు జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో ఆర్ఎంపీ క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి . ప్రాథమిక చికిత్సకే పరిమితమవాల్సిన ఆర్ఎంపీలు, పరిమితులు దాటి ఇంజక్షన్లు వేయడం, సెలైన్ బాటిళ్లు ఎక్కించడం వంటి వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఆర్ఎంపీల నిర్లక్ష్య వైద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పట్టణంలో ఆర్.ఎం.పి .ల వద్ద చికిత్స వికటించి ముగ్గురు మరణించిన దాఖలాలు ఉన్నాయి .అయినప్పటికీ, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఆర్ఎంపీల వద్ద చికిత్స సమయంలో ఇంజక్షన్లు, స్టెరాయిడ్లు, హెవీ డోసులు ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కొంతమంది ఆర్ఎంపీలు సొంతంగా ల్యాబ్‌లు కూడా నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేవలం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి కేసులు బయటపడకుండా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలని బాధితులు పలుమార్లు రోడ్డెక్కినా ఫలితం లేకపోయింది. చంటి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రమాదకర ఇంజక్షన్లు ఇస్తూ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి అక్రమ వైద్య కార్యకలాపాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకో వైపు జిల్లాలోని తాడిపత్రిలో మరో ఘోర దుర్ఘటన జరిగింది . వరహాలు తోట రంగప్ప కాలనీకి చెందిన ఒక మహిళ ఇటీవల కడుపులో మంట, కళ్ళు తిరగడంతో స్థానిక బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న ఒక ఆర్.ఎం.పి క్లినిక్‌కు వెళ్లారు.​రోగి పరిస్థితిని గమనించిన ఆ ఆర్.ఎం.పి, ఆమెకు బీపీ తక్కువగా ఉందని నిర్ధారించి.. తానే స్వయంగా ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు మెట్రోజిల్,పాంటోప్ వంటి ఇంజెక్షన్లను ఎక్కించారు.అయితే, నిబంధనల ప్రకారం ఇటువంటి వైద్యం చేయడానికి లేదా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి సదరు ఆర్.ఎం.పి కి ఎటువంటి అర్హత లేదు.మందులు ఎక్కించిన కొద్ది సేపటికే ఆ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది.పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను తాడిపత్రి ఏరియా ఆసుపత్రికి తరలించారు.కానీ దురదృష్టవశాత్తూ,ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.ఈ ఘటన వెలుగులోకి రాకుండా సదరు ఆర్.ఎం.పి భారీ ప్రయత్నాలే చేసినట్లు సమాచారం బాధితురాలి కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ఆశ చూపి, ‘దుప్పటి పంచాయితీ’ ద్వారా కేసును అణచివేయాలని చూసినట్లు విశ్వసనీయ సమాచారం.

జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖాధికారి ప్రాథమిక విచారణ జరిపి క్లినిక్ సీజ్ చేయాలని షోకాజ్ నోటీసులు జారీ చేసారు.అయినా కూడా ఏమి పట్టనట్టు ఆ RMP ప్రభుద్దుడు ఇప్పటికి క్లినిక్ కి వచ్చిన రోగులకు సూది మందులు వేస్తూ ఉండడం విస్మయానికి గురిచేస్తుంది .

Advertisements

You may also like

Our Visitor

026826
Total views : 151173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.