Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

by CVR NEWS

తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 13 లక్షలకుపైగా ఉండగా… ఇప్పుడు దాదాపు 50 వేల మేర తగ్గుదల నమోదైంది.
అయితే ఈ తగ్గుదల ప్రభుత్వ ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం సుమారు రూ.600 కోట్ల మేర పెరిగింది. దీని వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడమే అని తెలుస్తుంది . 2026 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ప్రతి లావాదేవీపై వసూలు అయ్యే రుసుములు పెరిగాయి. దీంతో తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినా… ప్రతి డీల్ నుంచి అధిక ఆదాయం రావడం వల్ల ప్రభుత్వ ఖజానా బలపడుతోంది.

మరిఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కొనుగోలుదారుల ధోరణిలో వచ్చిన మార్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. గతంలో చాలా మంది ఆస్తుల కొనుగోలు సమయంలో కనీస మార్కెట్ విలువ వద్దే రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందాలంటే… ఆస్తి అసలు విలువను చూపాల్సిన అవసరం పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు నిజమైన మార్కెట్ ధరలకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ మార్పు ప్రభుత్వానికి భారీ లాభాన్ని తెచ్చిపెడుతోంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపే విలువ పెరిగిన కొద్దీ స్టాంప్ డ్యూటీ, ఫీజులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా తక్కువ డాక్యుమెంట్లు నమోదైనా… ప్రతి డాక్యుమెంట్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతోంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతున్న సంకేతంగా కూడా భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో అక్రమ లావాదేవీలు తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

ప్రధానంగా హైదరాబాద్ నగరం ఈ మార్పుల కేంద్రంగా మారింది. ముఖ్యంగా కోకాపేట్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఆస్తుల డిమాండ్ గణనీయంగా పెరిగింది. కోటి రూపాయలకుపైగా విలువైన ఇళ్ల విక్రయాలు పెరగడం వల్ల మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. నివేదికల ప్రకారం లావాదేవీల సంఖ్య కొంత తగ్గినా… అధిక విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్ల వల్ల ఆదాయం సుమారు 11 శాతం పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.10,600 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ… 2025-26లో అదే కాలంలో రూ.11,300 కోట్లకు పెరిగింది. 6.6 శాతం వృద్ధిని సాధించింది . ఈ ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.19,100 కోట్ల లక్ష్యాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంది. ‘తెలంగాణ రైజింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా పెట్టుబడులు పెరగడం కూడా ఈ వృద్ధికి తోడ్పడుతోంది. మొత్తానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా… ఆదాయం పెరగడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కొత్త ధోరణిని సూచిస్తోందని చెప్పొచ్చు .

Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.