పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు. అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్రెడ్డి కదిలారని మండిపడ్డారు. ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్కు ఎవరిని ఎక్కడికి మార్చాలి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది.. రాని వారికి, కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని.. ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని, తడిసినధాన్యం, మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు. చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు. స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని.. అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి, దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు.
ysrcp
ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు. దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ప్రత్యర్థిని. రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అప్పటి కూచినపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యే గా ఎంపికై, మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్ దంపతులను వైసీపీ అధిష్టానం దగ్గరకు తీసుకుంది. స్వయంగా సీఎం జగన్ గత నెల 15 న వారిని పార్టీలోకి సాదరంగా చేర్చుకున్నారు.
అప్పట్లో పిఆర్పీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీ అధిష్టానం రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఈవూరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇంచార్జీ భాద్యతలు అప్పగించారు. ఎంపీ గానే కొనసాగనున్న మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో అతని స్థానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చేందుకు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం అప్పట్లోజోరుగా సాగింది. నేడు ఇంచార్జీ గా ప్రకటించి వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టించింది.
లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు. ఏళ్ళనాటి కల నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 19 సొసైటీలకుగాను 793.27ఎకరాలకు గాను 1209 మంది లబ్దిదారులకు లంకపట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంతవెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నోఎళ్ళనుండి ఎటువంటి ఆదారం లేకుండా లంకభూములను సాగుచేసుకుంటున్న పెదల కల నెరవేరింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రెవిన్యూ యంత్రాంగం అంతా కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో ఎంక్వయిరి చేసి లబ్దిదారుల ఎంపిక చేశారన్నారు. ఇంకా కొన్ని సొసైటీలో చిన్నచిన్న అవకతవకలు ఉంటే వాటిని సరిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. త్వరలో వారికి కూడా ఖచ్చితంగా పట్టాలు పంపిణీ చేస్తామ న్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ అర్హులైన పేదల లంక భూములకు పట్టాలు పంపిణీ లో స్థానిక రెవెన్యూశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు. పంపిణీ విషయంలో ఏవైనా అనర్హులుగా ఉండి పట్టాలు తీసుకుని ఉంటే నా దృష్పికి తీసురావచ్చని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి వెళ్తున్న జనసేన నాయకులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడప కి వచ్చి ఇళ్లు ఇచ్చామని బుక్ ఇచ్చాడు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇళ్లు ఎక్కడో చూపించమని వెళ్తే లోపలకి కూడా రానివ్వలేదని, ప్రజలు తమ దృష్టి కి తీసుకొచ్చారని, ఇళ్ళ పట్టాలు ఒక మోసం, దగా అని శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడులో జనసేన ఇంఛార్జి కోట వినుత ఆరోపించారు. ఇదే విషయం పై గడప గడపకు వెళ్తే మహిళలు ఖంగుతినే నిజాలు చెప్పారని వారు అన్నారు. రాబోయే రోజులలో టిడిపి జనసేన పొత్తులో భాగంగా తమ నాయకులను గెలిపించుకుంటే అందరికీ న్యాయం చేస్తామని కోట వినుత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉడి చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఓడి చెరువు నుంచి మద్దకవారిపల్లి వరకు20 కిలోమీటర్ల బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా కురుక్షేత్రంలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచి పైశాచిక ఆనందం పొందడంలో జగన్ కు సాటి మరెవరూ లేరని పల్లె విరుచుకుపడ్డారు. జనరంజక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యం అని పల్లె ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు పోవాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పల్లె పిలుపునిచ్చారు. అనంతరం మద్దుగవారిపల్లికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్టి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సమావేశం. రాష్ట్ర విభజన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని డా.ఎన్.తులసిరెడ్డి, ఏపీసీసీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్ అన్నారు. మౌళిక సదుపాయాలు, ముడిసరుకు ఉన్నా కడపకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం అమలు కాదని తేల్చారు. మన్నవరం ప్రాజెక్టు ను మూసివేశారని, కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను యూపీఏ ప్రభుత్వం మొదలెట్టినా..వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచిపోయిందని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా కడప – బెంగుళూరు రైల్వే లైన్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాశారని, వైఎస్సార్ సిఎంగా రైల్వే లైన్ క్లియర్ చేయిస్తే కుమారుడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేయించారని అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాజధాని, హైకోర్టు రెండూ అమరావతిలో నిర్మించినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే నష్టపోయేది రాయలసీమ వాసులేనని, కృష్ణానది యాజమాన్యం బోర్డు విశాఖలో పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి యాజమాన్య బోర్డుకు లేఖ రాశారని, రాయలసీమలో కృష్ణానది బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే నష్టపోయేది సీమ వాసులేనని, సీమలో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు డిమాండ్ చేస్తున్నామన్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి, జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 న జిల్లా పర్యటన కు రానున్నారని అందులో భాగంగానే నేడు పోర్టు లో పనులు ఎలా జరుగుతున్నాయో, ఎంత వరకు జరిగాయో పరిశీలనకు వచ్చామన్నారు. గత 40 సంవత్సరాలుగా భావనపాడు పోర్ట్ అని వింటున్నామని, మూలపేట పోర్ట్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి వల్లే సాకారం అయిందని అందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలను నిర్మూలించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. టిడిపి నాయకులు పోర్టు నిర్మాణ పనుల వద్దకు వచ్చి సందర్శించి సెల్ఫీ లు దిగాలని హేళన చేశారు. మార్చి నెలాఖరుకల్లా పోర్టు వద్దకు షిప్పుని తెచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనించాలని ప్రతిపక్షం నాయకుల మాటలు నమ్మవద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ పార్టీ నే అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బుచ్చినాయుడు కండ్రిగ మండలం పల్లమాల గ్రామపంచాయతీ రెవెన్యూ కి చెందిన పేద రైతుల పొలాలు కాలంగి నది పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో ఈసారి తుఫాను సృష్టించిన బీభత్సానికి దాదాపు 100 ఎకరాలలో ఇసుక మెట్లు ఏర్పడ్డాయి… పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి… ఈరోజు వరకు అక్కడికి పోలేని పరిస్థితి రైతులు తమ కుటుంబాన్ని పోషించే, నేలతల్లి కోతకు గురై వాగు వంక లాగా తయారవడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. ఈసారి భీకరమైన తుఫానుకు అదే సమయంలో కాలంగి నది పొంగిపొర్లడంతో వేల లక్షల టన్నుల ఇసుక గులకరాళ్లు పొలాల వైపుకు దూసుకొచ్చి పంట పొలాలు మాయమై ఇసుక ఎడారిగా మారిన వైనం. 1970 లో అప్పటి ప్రభుత్వం రైతు కూలీలకు పల్లమాల రెవెన్యూలో 220 ఎకరాల సొసైటీ భూమిని సాగు చేసుకోమని ఇవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక విపత్తుకు గురవుతూ నష్టపోతు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ రైతులు 50 సంవత్సరాలుగా శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి (పల్లమాల) సర్పంచ్ భర్త అయినా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 220 ఎకరాల సొసైటీ భూమి ప్రక్కనే ఉన్న కాలంగి నది పరివాహక ప్రాంతంలో ఒక కల్వర్టు నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షలు…. ప్రతి సంవత్సరం వీరి నష్టం దీనికి మించి ఉంటుంది వారిచే పరిహారం పంట నష్టానికి మాత్రమే…. ఇది పంట నష్టమే కాదు పొలాలలో ఇసుక వచ్చి చేరి తిరిగి పంటకు పొలాన్ని అనువుగా మార్చుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది… ఈ ఖర్చు రైతన్న జీవితాన్ని చిద్రం చేస్తుంది… ఇలాంటి ఘటనలే రైతన్న ఆత్మహత్యలకు కారణమవుతాయి….. అధికారులు గుర్తించి వీరి సమస్యకు శాశ్వతం పరిష్కారం చేయాలని కోరారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేని వారి పాలెం గ్రామాల్లో.. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, అరటి పొలాలను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70 నుంచి 80 శాతం వరకు రైతులకు పంట నష్టం జరిగిందని అన్నారు, చేతికి వచ్చిన పంట నేలపాలు అవ్వడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పంట నష్ట సేకరణ త్వరగా సేకరించాలని అధికారులకు సూచించారు, అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అని కేంద్ర ప్రభుత్వాలు కూడా విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవాలి అని… అవసరమైన చట్ట సవరణ కూడా చేయాలి అని అన్నారు… ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్ని, రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు అని… ఇనుమురేషన్ సమయంలో అధికారులు ఉదారంతో ఉండి పంట నష్ట వివరాలు సేకరించాలి అని ఆయన తెలిపారు, రైస్ మిల్లర్లు రైతులను నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దు అని అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ విషయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు.
Read Also…
Read Also…





Total views : 141166