తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్ లోని నివాసంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
Warangal
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం. హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు. ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు.
2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశాలిచ్చారు. క్రితం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లి వంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు. రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పరిమితి ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఏ విధంగా ఇచ్చిందో అదే మాదిరిగానే ఇస్తామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహించినా ఏనాడు ప్రజలను కలవలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి హన్మకొండ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు విజయయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మథర్ థెరిస్సా విగ్రహానికి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ లో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయం కోసం ప్రయత్నాలు చేసినా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎమ్యెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని, నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నారని అన్నారు. చాలా రోజుల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది కార్యకర్తల జనసందోహంతో భారీ ర్యాలీతో తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసి ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. అనంతరం దేవస్థానం వేదపండితులు నూతన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి శేష వస్త్రాలు అందించి ఆశీర్వచనం అందించారు.
హన్మకొండజిల్లా మెటర్నిటీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టోర్ రూం లో షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన, యాసిడ్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది, హాస్పిటల్ ఆవరణ మోత్తం నల్లటి పొగలతో నిండింది. దీంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Read Also..
Read Also..
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగుడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనగంటి రమ్య (22) అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో సామాజిక ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా రామన్నగూడెం, కమలాపురం రహదారి మార్గం సరిగా లేక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో, ప్రసవించిన రమ్య పాపకు జన్మించింది. అప్పటికి పరిస్థితి విషమించడంతో ఉమ్మనీరు మింగి పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపల్లి గ్రామంలో సోయం మల్లయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలెండర్ లికై మంటలు చెలరేగాయి. దీనితో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇల్లు దగ్ధం ఐన సంఘటనలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు భాదిత కుటుంబం విలపిస్తూ తెలిపింది. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తరపున చేయూత నివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు. రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా. ఊరు కొండారెడ్డి పల్లె. తండ్రి నరసింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. 1969 ఆగస్టు 8న జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది. కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు. రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10,919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్కు కలిసొచ్చాయి. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డీలా పడిపోయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా.. కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది. BRSకు చెందిన సీనియర్ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది.





Total views : 151311