అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం లేకపోవడంతో స్వంతంగా 30 నుండి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి రహదారి, కల్వర్ట్ నిర్మించుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం గిరిజనులను నిరాశకు గురి చేస్తోంది. రహదారి లేకపోవడంతో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇది కేవలం రోడ్డు సమస్య కాకుండా ప్రాణాలకు సంబంధించిన అంశంగా మారింది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు .సరైన రోడ్లు లేకపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు .
వైద్య అత్యవసర పరిస్థితుల్లో గిరిజన గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రహదారి లేకపోవడంతో డోలీలలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఒక సందర్భంలో అంబులెన్స్ అందుబాటులో లేక చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బురదమయమై, నడవడమే ప్రమాదకరంగా మారుతోంది. డుంబ్రిగూడ మండలం జాకర వలస గ్రామంలో రహదారి పనులు మధ్యలోనే ఆగిపోవడం, అరకు మండలం వర్రతోక వలసలో పనులు సరిగా పూర్తికాకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రజలు ఎన్నోసార్లు అధికారులను ఆశ్రయించినా స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ప్రాథమిక హక్కులైన ఆరోగ్యం, రవాణా సదుపాయాలు కూడా అందకపోవడం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అనంతగిరి మండలంలోని పలు గ్రామాలకు “అడవి తల్లి బాట” పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ, రహదారి పనులు ఇంకా పూర్తి కాలేదు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు మధ్యలోనే నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. గ్రామస్థులు “రోడ్డు ఉంటేనే తమ బతుకు” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే రోడ్లు పూర్తిగా బురదమయమై, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు వస్తారని, కానీ ఆ తరువాత సమస్యలను పట్టించుకోరని ప్రజలు విమర్శిస్తున్నారు. సరైన రహదారి లేకపోవడం వల్ల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కూడా దూరమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి రహదారి సదుపాయం కల్పిస్తేనే గిరిజన ప్రాంతాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.





Total views : 152424